Read more!

కుంభకోణం యాత్ర – 5

 

 

 

కుంభకోణం యాత్ర – 5

రామస్వామి ఆలయం

 


                                                                                         

ఆటో అతనికి లిస్టు చెప్పేశాము, అన్నీ దగ్గర దగ్గరే వుంటాయని తెలుసు గనుక దేని తర్వాత దేనికెళ్ళాలో మేము చెప్పలేదు.  అతని వీలునిబట్టి తీసుకెళ్ళాడు.  మేము మాత్రం మేము చెప్పిన వాటికన్నింటికీ తీసుకెళ్ళాడో లేదో చూసుకున్నాము అంతే. 

 

తర్వాత మా ఆటో రామస్వామి ఆలయం దగ్గర ఆగింది.  తెలిసిపోయిందికదా.  ఇది రాములవారి ఆలయం.  హడావిడిగా దేవుడి దగ్గరకెళ్ళి దణ్ణం పెట్టకు వచ్చేయటం ఇక్కడి ఆలయాల్లో కుదరదు.  కాస్తో కూస్తో కలాపోసన కలిగిన వాళ్ళకి ఆలయంలో అన్నీ చూడటానికి సమయం వెచ్చించాల్సి వస్తుంది.  ఇంతా తీరిగ్గా చూసినా, మనకి తెలియక కూడా కొన్ని చూడలేక పోతాము.  వాటిని కూడా మీకోసం  మీకు తెలియ జేస్తున్నాను. 

 

 

రఘునాయకుడు  క్రీ.శ. 1614 – 40 మధ్య తంజావూరు రాజ్యాన్ని పరిపాలించాడు.  ఆయన రామ భక్తుడు.  ఆ సమయంలో నిర్మించిన ఆలయం ఇది.  ఆయన మంత్రి గోవింద దీక్షితార్ (గోవింద అయ్యన్ అని కూడా అంటారు) కూడా రామ భక్తుడు.  ఆయన నిర్మాణాన్ని పర్యవేక్షించాడు.  

 

ఈ ఆలయ నిర్మాణానికి పునాది ఇక్కడికి సమీపంలోని దారాసురంలో పడ్డది.  రఘునాయకుడు దారాసురంలో ఒక చెరువు నిర్మాణానికి భూమి తవ్విస్తున్నప్పుడు ఈ విగ్రహాలు బయట పడ్డాయిట.  ఆయన అత్యంత సంతోషంతో కుంభకోణం మధ్యలో ఆలయం నిర్మించి రామస్వామి ఆలయం అని పేరు పెట్టాడుట.

 

 

కుంభంకోణంలో 12 ఏళ్ళకి ఒకసారి జరిగే కుంభమేళాలో ప్రాముఖ్యత వహించే  విష్ణ్వాలయాల్లో 5 ముఖ్యమైనవి.  వాటిలో ఈ రామస్వామి ఆలయం కూడా ఒకటి.  మిగతావి సారంగపాణి, చక్రపాణి, రాజగోపాలస్వామి, వరాహ పెరుమాళ్ళు. 

 

400 సంవత్సరాల క్రితం నిర్మింపబడిన ఈ ఆలయంలో  విగ్రహాలు సాలిగ్రామ శిలలతో చెయ్యబడినవి.  8 అడుగుల పైనే వుంటాయి.   రాముడు, సీత ఒకే పీఠంపై వుంటారు.  ఒక పక్క శత్రుఘ్నుడు వీరికి చామరం వీస్తూ వుంటాడు.  భరతుడు ఛత్రంపట్టి వుంటాడు.  లక్ష్మణుడు తన విధి మర్చిపోకుండా విల్లంబులు ధరించి సదా వీరి రక్షణలో వుంటాడు.  ఆంజనేయుడు ఒక చేతిలో వీణ, ఒక చేతిలో రామాయణం ధరించి రామాయణ గానం చేస్తున్నట్లు వుంటాడుట. (ట ఎందుకంటే అంత అందమైన, పెద్ద రామ పట్టాభిషేకం విగ్రహాలు చూస్తూ ఆంజనేయ స్వామి చేతిలో ఏముందీ చూడలేదు..  ముందు తెలియక పోవటంవల్లే.   పైగా స్వామి మెళ్ళో పూల మాలలు కూడా అడ్డు వచ్చి వుంటాయి.   అందుకే చూడని విశేషాలు కూడా సేకరించి మీకు చెప్పేది.  మీరు వెళ్ళినప్పుడు గుర్తుంచుకుని చూడండి .. ఆంజనేయస్వామి వీణ పట్టుకున్నాడంటే అరుదైన విగ్రహంకదా).

 

 

ఈ ఆలయంలో విగ్రహాలు ఆయోధ్యలో వున్నట్లు వుండటంతో దీనిని దక్షిణ అయోధ్య అని కూడా అంటారు.  సాధారణంగా మన రామాలయాలలో సీతా, రామ, లక్ష్మణ, ఆంజనేయులను చూస్తాము.  ఇక్కడ అన్నదమ్ములు అందరూ వుంటారు. ఇలా అందరూ వున్న ఆలయాలు తక్కువ వుంటాయి.  తెలంగాణాలో నల్గొండలో రామాలయంలో ఇలాంటి విగ్రహాలున్నాయి.  ఇదీ 400 ఏళ్ళ క్రితం ఆలయం అంటారు.

 

ఆలయంలో ముందు 62 స్తంభాలతో వున్న మండపం వున్నది.  ప్రతి స్తంభం ఒకే రాతితో చెక్కబడింది.  వీటి మీద సుగ్రీవ పట్టాభిషేకం, విభీషణ పట్టాభిషేకం, అహల్యా శాప విమోచనం మొదలైన రామాయణ ఘట్టాలు అతి సుందరంగా చెక్కబడ్డాయి.  ఈ అద్భుత శిల్ప సౌందర్యాన్ని తనివి తీరా చూడాలంటే ఎంత సమయమూ సరిపోదు.

 

ప్రదక్షిణ మార్గంలో గోడమీద మూడు వరసల్లో  రామాయణం లోని ఘట్టాలు 219 చిత్రించారు.  ఈ చిత్రాలు ప్రకృతి ప్రసాదించిన రంగులతో చిత్రించబడ్డవి.  ఒక్కొక్క వరసలోని చిత్రాలు చూసుకుంటూ, వ్యాఖ్యానాలు చదువుకుంటూ మూడు ప్రదక్షిణలు పూర్తి చేసేసరికి రామాయణ గాధ మొత్తం చదివినట్లే.

 

స్కూలు పిల్లలని ఇక్కడికి తీసుకు వచ్చి ఈ చిత్రాల ద్వారా, శిల్పాల ద్వారా రామాయణం తెలియజేస్తారంటే ఎంత అద్భుతమైన విషయమోకదా.  అందమైన ఆ చిత్రాలు, శిల్పాల ద్వారా నేర్చుకున్న విషయాలు చిన్నారుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తాయికదా.  ఆలయాల వల్ల ఎంత ఉపయోగమో చూడండి.

 

 

 

 

 

 

.. పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)